
భార్యాభర్తలు
ఇద్దరూ ఉద్యోగం చేస్తే ఆర్థికంగా బోలెడంత వెసులుబాటు. నేటి ఆర్థిక
పరిస్థితుల రీత్యా వేన్నీళ్లకు చన్నీళ్లలా దేనికో దానికైనా వస్తాయనీ ఈ
రోజుల్లో ఎంత చిన్న ఉద్యోగమైనా మహిళలు చేయడానికి సిద్ధపడుతున్నారు. అయితే
ఉద్యోగం చేసే మహిళలకు జీవనశైలి రుగ్మతల తాకిడి ఎక్కువని నిపుణులు
అంటున్నారు. ఉద్యోగం చేసే మహిళల్లో 68 శాతం మంది తీవ్రస్థాయి ఒత్తిడితో
జీవనశైలి రుగ్మతల బారిన పడుతున్నారని భారత పరిశ్రమల సంస్థ 'అసోచామ్'
చేపట్టిన ఒక సర్వేలో వెల్లడైంది. పట్టణ భారతంలో 27 శాతం మంది మహిళలు
ఉద్యోగాలు చేస్తున్నారు. 21-52 సంవత్సరాల మధ్య వయసుతో ఉద్యోగాలు చేస్తున్న
మహిళలపై ఈ సర్వే చేపట్టారు. ఇందులో 68 శాతం మంది జీవనశైలి కారణంగా తలెత్తే
స్థూలకాయం, కుంగుబాటు, దీర్ఘకాలిక నడుమునొప్పి, మధుమేహం, అధిక రక్తపోటు
వంటి సమస్యలతో సతమతమవుతున్నట్లు గుర్తించారు. ఈ సర్వేను దేశవ్యాప్తంగా 11
రంగాలకు చెందిన 72 కంపెనీల్లో చేపట్టారు. ఎక్కువ సమయం పనిచేయాల్సి రావటం,
స్పష్టమైన సూచనలు లేకుండా నిర్దేశిత లక్ష్యాలకు అనుగుణంగా విధులు
నిర్వర్తించటం వల్ల 75 శాతం మహిళా ఉద్యోగులు కుంగుబాటు, ఆందోళనతో
బాధపడుతున్నారు. పని ఒత్తిడి, నిర్దేశిత లక్ష్యం కారణంగా తరచూ భోజనం
మానేయటం, చిరుతిండిపై ఆధారపడటం పెరుగుతున్నట్లు 52 శాతం మంది వెల్లడించారు.
నిద్ర సరిగా లేకపోవటం, కాలుష్యం, వ్యాయామం లేకపోవటం, సూర్యరశ్మి
తగలకపోవటం, పోషకాహారం అందకపోవటం వంటివన్నీ వీరికి సమస్యలుగానే పరిణమించాయని
తేలింది. వీరిలో ఎక్కువమంది అనారోగ్య సమస్యలు వచ్చినా, వైద్యుల్ని
సంప్రదించకుండా తోసిరాజని తిరుగుతున్నట్లు గుర్తించారు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి