మనుషుల్లో ఉన్నట్లే ఆహారపదార్థాల్లో కూడా అత్యుత్తమైనవి ఉంటాయి. ఎలాంటి ఆహార పదార్థాలు మంచివో మీకు చాలా బాగా తెలుసు. వీటికన్నా మెరుగైనవీ ఉన్నాయి. అయితే వీటిని ఒక్కొక్కటి కాకుండా జంటగా తీసుకోవడం వల్ల మంచి ఆరోగ్య ఫలితం ఉంటుందని పోషకాహార నిపుణులు షీలా అంటున్నారు.
యాంటి-ఇన్‌ఫ్లమేటరీ, గాయాలను నయం చేసే గుణాలు పసుపులో ఉన్నాయి. సాల్మన్‌లో (ఒక రకమైన సముద్రపు చేప) పిండిపదార్థాలు తక్కువ, ప్రోటీన్లు ఎక్కువగా ఉంటాయి. ఈ రెండింటిని కలిపి తింటే- సాల్మన్‌లో ఉండే ఓమెగా-3 ఫ్యాటి ఆసిడ్లు ఊపందు కుంటాయి. ఇది నాడీవ్యవస్థను సంరక్షిస్తుంది. మంచి కొలెస్ట్రాల్-హెచ్‌డిఎల్‌ను పెంచుతుంది. ధమనుల్లో చెడుకొలెస్ట్రాల్ తొలగిపోవడంతో గుండె ఆరోగ్యం మెరుగవుతుంది. వీటిని కలిపి తీసుకోవడం వల్ల క్యాన్సర్ కణాలు పెరగవు, ఫలితంగా కణతి వృద్ధి చెందడం నెమ్మదిస్తుంది.
తృణధాన్యాలు-ఉల్లిపాయలు
తృణధాన్యాలు-మొక్కజొన్న, పాలిష్‌పట్టని బియ్యం, బార్లీ, గోధుమల్లో వివిధ ప్రమాణాల్లో ఐరన్, జింక్ ఉంటాయి. ఈ రెండు ఖనిజాలు శరీరంలో శోషణ కావాలంటే ఉల్లిపాయల్లో ఉండే సల్ఫర్ ముఖ్యం.
చిక్కుళ్లు- కూరగాయలు
చిక్కుళ్లలో అధికంగా ప్రోటీన్లు, ఐరన్ ఉంటాయి. వీటిని పాలకూర, మొలకలు, బంగాళదుంపలతో కలిపి తీసుకుంటే బరువు తగ్గుతారు. ' మన శరీరం పిండి పదార్థాలు, కొవ్వుల కంటే ప్రోటీన్ల జీవక్రియకు మూడు రెట్లు ఎక్కువ శక్తిని వినియోగిస్తుంది' అని షీలా అంటారు. చిక్కుళ్లు, కూరగాయలు కలిపి తీసుకోవడంవల్ల బరువు పెరగడాన్ని నివారించొచ్చు. చిక్కుళ్లలోని ఐరన్ శోషణకు కూరగాయల్లోని విటమిన్-సి సహకరిస్తుంది.
టమాట-ఆలివ్‌నూనె
టమాటాలో విటమిన్-సి, లైకోపీన్ అనే యాంటిఆక్సిడెంట్ గణనీయమైన పరిమాణంలో ఉంటాయి. ఈ యాంటాక్సిడెంట్లు వృద్ధాప్య ప్రభావాలను, క్యాన్సర్‌ను, ఆస్టియోపోరొసిస్ (బోలు ఎముకల వ్యాధి), క్యాటరాక్ట్ (శుక్లాల వ్యాధి) వచ్చే ప్రమాదాన్ని తగ్గిస్తుంది. ఆలివ్ ఆయిల్‌లో కూడా అధికంగా యాంటి ఆక్సిడెంట్లుంటాయి. ఇవి శరీరంలో మంచి కొలెస్ట్రాల్ ఏర్పడటాన్ని ప్రోత్సాహిస్తాయి. ఆలివ్‌నూనె సమక్షంలో లైకోపీన్ ఉత్తమంగా శోషణ చెందుతాయి. అంతేకాక ఆలివ్‌నూనె గుండె ఆరోగ్యానికి మేలు చేస్తుంది. ఇది రక్తాన్ని శుద్ధిచేయడమేకాక, పిత్తాశయంలోని రాళ్లను కరిగిస్తుంది. ఇవి రెండూ, కాలేయ పనితీరును మెరుగుపరచడమే కాక, శరీరాన్ని విషరహితంగా చేస్తుంది. అధిక రక్తపోటు వల్ల కలిగే ప్రభావాలను తగ్గిస్తుంది.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి