వేసవి ప్రభావం అప్పుడే మొదలైంది. బయటకెళితే చాలు, చర్మం కంది పోవడం, కమిలిపోవడం, మెరుపు తగ్గి పొడిబారడం ఆరంభమైంది. వచ్చే మూడు నాలుగు నెలల్లో మరింత ఇబ్బందిపెట్టే ఈ సమస్యలకు తాజా పండ్లు, రసాలు, గుజ్జు వంటి వాటితో ఫేషియల్స్ చేసుకోవడమే పరిష్కారం. ఇవి చర్మ కోమలత్వం చెదరకుండా కాపాడతాయి. శక్తిమంతమైన యాంటీ ఆక్సిడెంట్లుగా విటమిన్లు, పొటాషియం, సల్ఫర్, జింక్ వంటి ఖనిజ లవణాలు వంటివన్నీ పండ్లు ఆహారంగా తీసుకోవడం వల్ల కలిగితే... వీటి గుజ్జు సౌందర్య సాధనంగా పనిచేస్తుంది.
- చర్మానికి హాయి..
సౌందర్య చికిత్సలో వాడదగిన పండ్లలో మామిడి, అరటి, స్ట్రాబెర్రీ, ద్రాక్ష, దానిమ్మ, పుచ్చకాయ, బత్తాయి, నారింజ, ఖర్జూరం, బొప్పాయి... ఇలా ఎన్నో ఉన్నాయి. ఒక్కో పండుది ఒక్కో ప్రత్యేకత. ప్రతి పండూ మేని నిగారింపును పెంచి, సరికొత్త అందాన్ని చేకూరుస్తాయి.
- మామిడితో మంచి రంగు..
ఎలాంటి చర్మతత్వం గలవారైనా ఈ పండును సౌందర్య చికిత్సలో వాడొచ్చు. రెండు చెంచాల మామిడి గుజ్జు, చెంచా చొప్పున తేనె, పెరుగు తీసుకోవాలి. వీటన్నింటినీ బాగా కలిపి, ముఖం, మెడ భాగానికి పూతలా వేసుకోవాలి. రెండు మూడు నిమిషాలు సున్నితంగా మర్దన చేసి, వదిలేయాలి. పది నిమిషాల తరువాత నీళ్లతో కడిగేసుకుంటే చాలు. అయితే సబ్బు వాడకూడదు. ఇలా వేసవంతా రోజు మార్చి రోజు ఈ పూత వేసుకోగలిగితే.. చర్మం పసిమిచాయతో మెరిసిపోతుంది.
- 'అరటి' తో అద్భుతం..
ఈ పండు చర్మానికి మంచి తేమనిస్తుంది. దీన్నికూడా ఏ చర్మతత్వం వాళ్లయినా వాడొచ్చు. ముఖ్యంగా పొడి చర్మతత్వం గల వారికి చాలా మంచిది. ముఖంపై వున్న ముడతల్ని నివారించే శక్తి ఈ పండు సొంతం. అరటిపండును కొద్దిగా కోసి, ఆ ముక్కను తేనెలో ముంచి ముఖం నుంచి మెడదాకా రుద్దాలి. ఇలా ఐదు నిమిషాలు చేయాలి. ఆ తరువాత కడిగేసుకుంటే చర్మం కోమలంగా మారుతుంది.
- స్ట్రాబెర్రీతో సొగసుగా..
జిడ్డు చర్మతత్వం వున్న వాళ్లకు ఈ పండుతో వేసే పూత చాలా బాగా పనిచేస్తుంది. చెంచా స్ట్రాబెర్రీ రసం, ముల్తానీమట్టి, కలబంద గుజ్జు చెంచా చొప్పున, అరచెంచా తేనెతో కలిపి పూతలా వేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి రాసుకొని ఆరాక కడిగేసుకోవాలి. ఈ పూతతో మొటిమలు తగ్గుతాయి. అధిక జిడ్డు వదులుతుంది. ఈ పూతను వారానికి మూడుసార్లు వేసుకోవచ్చు. పొడిబారిన చర్మతత్వం ఉన్న వాళ్లు ఈ ప్యాక్‌ని ప్రయత్నించకూడదు. ఎందుకంటే ఈ పండులో అధికంగా ఉండే సి విటమిన్ చర్మాన్ని మరింత పొడిగా మారుస్తుంది.
- ద్రాక్షతో ధగధగ..
అరకప్పు ద్రాక్షపండ్లను గుజ్జులా చేసి ముఖానికి ప్యాక్‌లా వేసుకోవాలి. పదినిమిషాల తరవాత కడిగేసుకుంటే చాలు. ఎంతో మార్పు ఉంటుంది. జిడ్డు చర్మం ఉన్న వాళ్లు ముల్తానీమట్టిని ద్రాక్ష రసంలో కలిపి పూతలా వేసుకోవచ్చు. దీనివల్ల చర్మం తాజాదనంతో మెరిసిపోతుంది.
- దానిమ్మతో అందం..
ఎండవల్ల చర్మం సహజ అందాన్ని కోల్పోతుంది. వార్థక్యపు చాయలు తప్పవు. అలాంటి సమస్యల్ని నివారించి, చర్మంలో కొలాజిన్ ఉత్పత్తి, సాగేగుణాన్ని పెంచాలంటే.. దానిమ్మ పూతను ప్రయత్నించాలి. ఎలాంటి చర్మతత్వం గలవారైనా ఈ పండును వాడొచ్చు. దానిమ్మ గింజలకు కొద్దిగా బొప్పాయి గుజ్జు కూడా కలిపి వాడితే.. చర్మం రంగు పెరగడమే కాదు.. ముడతలు కూడా తగ్గుతాయి. చెంచా బొప్పాయి గుజ్జులో దానిమ్మ రసం రెండు చెంచాలు, చెంచా పాలపొడి కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి పూతలా వేసి 15 నిమిషాల తర్వాత మునివేళ్లను తడిచేసుకుని పూతపై రుద్దుతూ తొలగించుకోవాలి. ఇలా చేస్తే మీ సహజమైన అందం మీ సొంతం అవుతుంది.
- పుచ్చకాయ ప్యాక్..
ఈ పండు చర్మాన్ని త్వరగా చల్లబరుస్తుంది. రెండు చెంచాల పుచ్చకాయ గుజ్జు, అరచెంచా తేనె, ఒకటిన్నర చెంచా ముల్తానీమట్టి తీసుకుని అన్నింటినీ కలిపి చర్మానికి పూత వేయాలి. దీనివల్ల ఎండకు ఎర్రగా మారిన చర్మంలో చాలా త్వరగా మార్పు కన్పిస్తుంది. అందగానూ మారుతుంది.
- బొప్పాయితో బహుచక్కగా..
అన్నిరకాల చర్మతత్వాల వారికీ మేలుచేసే బొప్పాయి పండు గుజ్జును చర్మానికి నేరుగా రాయకూడదు. దానివల్ల చర్మం చాలా మొరటుగా తయారయ్యే ప్రమాదం వుంది. చెంచా బొప్పాయి గుజ్జులో అదే మోతాదులో కీరదోస గుజ్జు కలిపి రాసుకోవాలి. ఆరాక కడిగేసుకుంటే చర్మం తళుకులీని, తేటగా కనిపిస్తుంది.
- ఖర్జూర ప్యాక్..
నాలుగైదు ఎండు ఖర్జూరాల్ని నీళ్లల్లో నాలుగు గంటలు నానబెట్టాలి. తరువాత చిక్కగా చేసుకుని, అందులో చెంచా పాలపొడి వేసి బాగా కలిపి ప్యాక్‌లా వేసుకోవాలి. ఆరాక కడిగేసుకుంటే ఫలితం ఉంటుంది. ఎండు ఖర్జూరాలే కాదు.. బజార్లో దొరికే గింజల్లేని తాజా వాటిని కూడా ప్రయ త్నించవచ్చు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి