27, సెప్టెంబర్ 2013, శుక్రవారం

కొలెస్ట్రాల్‌కు దూరంగా...

ఈ రోజుల్లో చాలా మందికి కొలెస్ట్రాల్‌ భయం పట్టుకుంది. గుండె జబ్బులు రావడానికి కొలెస్ట్రాల్‌ ముఖ్యకారణం అవుతోంది. కొలెస్ట్రాల్‌కు దూరంగా ఉండాలంటే ఇలా చెయ్యాలి...
వంటకాలలో డాల్డాతో పదార్థాలు తయారు చేసుకోవడం తగ్గించాలి. నాన్‌స్టిక్‌ పాన్‌ వాడితే కూరల్లో నూనె తక్కువ వేసినా సరిపోతుంది. కూరలను ఆవిరి మీద ఉడికించి తినడం మంచిది.
కూరలలో నూనె వాడకం వీలైనంత తగ్గించాలి. నూనెలో ముంచి తీసే బజ్జీల లాంటి పిండి వంటలు వద్దు. ఎప్పుడూ ఒకే రకం నూనె కాకుండా రెండు రకాల ఆయిల్స్‌ కలిపి వాడితే మంచిది.
జీడిపప్పు, వేరుసెనగ పప్పు లాంటివి వీలైనంత తగ్గించాలి. కాయగూరలు, పండ్లు వీలైనంత ఎక్కువగా తినాలి. ఇక, తృణధాన్యాలు ఎక్కువగా, పప్పు ధాన్యాలు కొంత పరిమితంగా తీసుకోవాలి.
రోజూ రెండు మూడు పచ్చి వెల్లుల్లి రేకులు, ఒక ఉల్లిపాయ తినవచ్చు. నూనెలో చేసే పూరీల కన్నా నూనె లేకుండా చేసే పుల్కాలు తినాలి.
గుడ్లు, పచ్చళ్ళు, అప్పడాలు, స్వీట్స్‌, కేకులు, పిజ్జాలు, చాక్లెట్లు చాలా తక్కువగా తినాలి లేదా పూర్తిగా మానేయవచ్చు, హోల్‌మిల్క్‌ బదులు కొవ్వు తీసేసిన మిల్క్‌ తాగాలి. వెన్న, నెయ్యి వాడవద్దు.
పాలతో చేసిన పదార్థాలు వీలైనంత తగ్గించాలి. మొలకెత్తే విత్తనాలు, పండ్లు బాగా తినవచ్చు.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి