26, సెప్టెంబర్ 2013, గురువారం

సీజనల్‌ వ్యాధులూ.. నివారణా పద్ధతులు..


సీజనల్‌ వ్యాధుల భయం ప్రజలను వెంటాడుతోంది. దోమల ద్వారా వ్యాప్తి చెందే డెంగ్యూ, చికున్‌గున్యా, మలేరియా, అతిసార వంటి వ్యాధులు ఈ సీజన్లో విస్తరించే అవకాశం ఉంటుంది. ఇంతకీ అవి ఎందుకొస్తాయి. ఎలాంటి ఇబ్బందిని కలుగుజేస్తాయి. ఎలాంటి లక్షణాలు పొడచూపు తాయి. ఏ విధంగా నివారించ వచ్చు తదితర అంశాలను తెలుసుకొని జాగ్రత్త పడితే వాటిని అరికట్టవచ్చు.
గుంటల్లో నిలిచిన వర్షపు నీరు, మురికిగా మారిన తర్వాత అందులో దోమలు నివాసాలు ఏర్పర్చుకుని విపరీతంగా వృద్ధి చెందుతాయి. ఈ దోమలు కుట్టడంవల్ల పలురకాల వ్యాధులు వ్యాప్తి చెందుతాయి. ముఖ్యంగా వీటివల్ల వచ్చే వ్యాధుల్లో డెంగ్యూ, చికున్‌గున్యా, మెదడువాపు, మలేరియా, అతిసార వీటిని సకాలంలో గుర్తించి, సరైన చికిత్స తీసుకోకపోతే మరణాలు సంభవిస్తాయి. అయితే ఈ వ్యాధులకు హోమియో చికిత్సా బాగా పనిచేస్తుంది.
డెంగ్యూ, లక్షణాలు
జ్వరమూ, ఎముకల నొప్పులూ ఉంటాయి. కళ్లలోంచి నీరు కారుతుంది. కళ్లు కదలించడం కష్టంగా మారుతుంది. ఆకలి తగ్గుతుంది. వాంతి అయ్యేటట్లు ఉంటుంది. శరీరంపై దుద్దుర్లూ, పొక్కులూ వస్తాయి. ముక్కులోంచి రక్తం పడుతుంది. రక్త విరేచనాలూ, తలనొప్పీ విపరీతంగా ఉంటుంది. దీనికంతటికీ కారణం డెంగ్యూ వైరస్‌, ఎడిస్‌ ఈజిప్టు దోమలు. డెంగ్యూ సోకిన వ్యక్తిని వెంటనే ఆస్పత్రికి చేర్చాలి. రోగికి తరచూ ద్రవ పదార్థాలు ఇవ్వాలి. అవసరమైతే రక్త మార్పిడి చేయాలి.
జాగ్రత్తలు
దోమలకు అవాసాలైన నీళ్ల తొట్టెలూ, టైర్లూ, పాడైపోయిన కూలర్లల్లో నీళ్లూ నిలువ ఉండకుండా చూడాలి.
మందులు
డెంగ్యూ వ్యాధి నివారణకు జల్సీ మియం అనే మందును వ్యాధి రాకముందు, ఒకరోజు మూడు మోతాదులు తీసుకుంటే వ్యాధి సోకకుండా ఉంటుంది.
వ్యాధి సోకితే యుఫటోరియం పర్ఫో టం అనే మందును వాడటంవల్ల మంచి ఫలితాలు ఉంటాయి. వ్యాధిని త్వరగా నివారించవచ్చు.
చికున్‌ గున్యా
ఇది ప్రాణాంతక వ్యాధి కానప్పటికీ, మనిషిని కదలలేని స్థితికి చేర్చుతుంది. నీరసింపజేస్తుంది. శారీరకంగా, మానసికంగా కుంగిపోయే పరిస్థితి కల్పిస్తుంది.
లక్షణాలు
వైరస్‌ సోకిన వెంటనే అధిక జ్వరం, తీవ్రమైన కీళ్ల నొప్పులు ఉండి, మనిషి కదలలేని స్థితి ఏర్పడుతుంది. తలనొప్పి, నిద్రలేమి బాధిస్తాయి. వ్యాధి తీవ్రత 5 నుంచి 7 రోజుల వరకూ ఉంటుంది.
జాగ్రత్తలు
శరీరంలోని ద్రవాలూ, లవణాలూ తగ్గిపోతాయి గనుక ఆహార పానీయాలు సక్రమంగా తీసుకోవాలి. లేకపోతే ప్రాణాపాయానికి దారితీస్తుంది. దోమలు కుట్టకుండా దోమ తెరలు వాడాలి. నీళ్లు నిలువ ఉండకుండా జాగ్రత్త వహించాలి.
నివారణ
వ్యాధి సోకకముందు అయితే, యుఫటోరియం పర్ఫోరేటం అనే మందును వారానికి ఒక రోజు, మూడు పూటలు తీసుకోవాలి. ఇలా వ్యాధి ప్రబలి ఉన్నంత కాలం తీసుకోవాలి. వ్యాధి సోకిన తర్వాత ఆయా లక్షణాలను బట్టి రస్టాక్స్‌, బ్రయోనియా అనే మందులను రోజుకు మూడుసార్లు, మూడు రోజులు వాడితే వ్యాధి తీవ్రత తగ్గుతుంది.
మలేరియా
మలేరియా జ్వరం ప్రతియేటా వర్షాలు పడిన తర్వాత, దోమలవల్ల వ్యాప్తి చెందుతోంది. మలేరియా ప్రోటోజోవా జీవి అయిన ప్లాస్మోడియం ద్వారా సోకుతుంది. ఆడ ఎనాఫిలిస్‌ దోమ కుట్టడం ద్వారా ఈ వ్యాధి వ్యాప్తి చెందుతుంది.
లక్షణాలు
తీవ్రమైన జ్వరంతోపాటు చలి ఎక్కువగా ఉంటుంది.
జాగ్రత్తలు
దోమలను నివారించడం ద్వారా ఈ వ్యాధిని అరికట్టవచ్చు. దోమ తెరలు వాడాలి. నీళ్లు నిలువ ఉండకుండా చూసుకోవాలి.
నివారణ
చైనా, చినూనమ్‌ ఆర్స్‌, మలేరియా అఫిసినా లిస్‌, సల్ఫర్‌ అనే మందు లు మలేరియా నివార ణకు పనిచేస్తాయి.
అతిసార
ఇది వర్షాకాలంలో కలుషిత నీటి ద్వారా ఎక్కువగా ప్రబలుతుంది. ఈ వ్యాధికి గురైన వారికి ఉన్నట్లుండి వాంతులూ, విరేచనాలూ అవుతాయి.
కొందరిలో జ్వరం రావడం, విపరీతమైన కడుపునొప్పి రావడం, నోరు ఎండిపోవడం, కాళ్లు లాగడం వంటి లక్షణాలు ఉంటాయి. ఈ వ్యాధిలో ప్రధానంగా వాంతులూ, విరేచనాలూ తొందరగా తగ్గించడానికి మందులు వాడాల్సి ఉంటుంది.
లక్షణాలు
వాంతులూ, విరేచనాలూ ఉన్నట్లుండి ఒకేసారి పెద్దమొత్తంలో అవుతాయి. తద్వార శరీరంలోని నీటి శాతం తగ్గిపోయి డీహైడ్రేషన్‌ స్థితి ఏర్పడుతుంది. ఇలాంటి స్థితిలో చర్మాన్ని పైకి లాగి, వదిలితే అలాగే ఉండిపోతుంది. వృద్ధుల్లో చర్మం ముడతలు పడి ఉంటుంది. కళ్లు గుంటల్లాగా మారి, బాగా నీరసించి పోతారు. అతిసార వ్యాధి తీవ్రమైనప్పుడు నాడి వేగమూ పెరుగుతుంది. కొన్ని సందర్భాల్లో నాడి తెలియని పరిస్థితి దాపురిస్తుంది.
రక్తపోటు తగ్గిపోతుంది. దీనిని నమోదు చేయలేని స్థితికీ మారవచ్చు. వ్యాధి తీవ్రమైతే శరీరం చల్లబడి, రోగి అపస్మారక స్థితిలోకీ, కోమాలోకి వెళ్లి మరణించే అవకాశం ఉంటుంది.
నివారణ
అతిసార వ్యాధివల్ల శరీరం నీటినీ, లవణాలనూ అత్యధికంగా కోల్పోతుంది. కనుక ఈ వ్యాధికి గురైన రోగికి వెంటనే ద్రవ పదార్థాలు ఇవ్వాలి.
కొబ్బరినీళ్లు, మంచినీరు, మజ్జిగ మొదలైనవి ప్రారంభం నుంచీ ఇవ్వాలి.
డీహైడ్రేషన్‌ నివారణకు కాచి, చల్లార్చిన ఒక గ్లాసు నీటిలో రెండు స్పూన్ల పంచదార, చిటికెడు ఉప్పు కలిపి ఇవ్వాలి. లేకపోతే ఓరల్‌ రీ హైడ్రేషన్‌ సొల్యూషన్‌ ఇవ్వాలి.
అతిసార వ్యాధికి గురైన వ్యక్తి నోటితో ద్రవ పదార్థాలు తీసుకోగలిగినంత వరకూ సెలైన్‌ అవసరం రాదు.
ఆ విధంగా తీసుకోలేని స్థితిలో ఇంట్రావీనస్‌ ద్వారా డాక్టర్ల సమక్షంలో సెలైన్‌ను ఇవ్వాల్సి ఉంటుంది.
మందులు
హోమియో మందులను వ్యాధి లక్షణాల ఆధారంగా వాడవలసి ఉంటుంది. ముఖ్యంగా పోడోపైలం, ఆర్సినిక్‌ ఆల్బ్‌, కాంఫర్‌, వెరాట్రం ఆల్బం, చైనా, ఇపికాక్‌ వంటి మందులను వాడితే అతిసార వ్యాధి నివారించవచ్చు.

డాక్టర్‌ పావుశెట్టి శ్రీధర్‌
హోమియో ఫిజీషియన్‌
హన్మకొండ 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి