26, సెప్టెంబర్ 2013, గురువారం

అవును! కంప్యూటర్‌ గేమ్స్‌ వ్యసనమే

ఇటీవలి కాలంలో చాలా మంది చిన్నారులకు కంప్యూటర్‌ గేమ్స్‌ ఆడడం ఒక వ్యసనంగా మారింది. ఒక్కడే పిల్లాడు (ఏకైక సంతానం) అయి, పిల్లలతో తల్లిదండ్రుల ఎక్కువ సమయం గడపలేనప్పుడు, ఆడుకోవడానికి తోటి వయసు వారు లేనప్పుడు పిల్లలకు ఈ ధోరణి అలవడుతుంది. మంచి తెలివితేటలు, శారీర దారుఢ్యం ఉన్నప్పటికీ భావోద్వేగాలపరంగా బలహీనులైన కొందరు పిల్లలు త్వరగా ఈ రకమైన వ్యసనాలకు లోనవుతారు. ఇంకా కంప్యూటర్‌ గేమ్‌సెంటర్లలో ఉండే పెద్ద పెద్ద మానిటర్లు, ఆడియో-విజువల్‌ ఎఫెక్టులు, కొత్త కొత్త గేమ్స్‌, టెర్రరిస్టులను మట్టుబెట్టడం, మిలిటరీ తరహా సాహసకృత్యాలు పిల్లల్ని అందునా అబ్బాయిలను ఇట్టే ఆకర్షిస్తాయి. ఈ ఆటలను ఆడేటప్పుడు అబ్బాయిలు పెద్దగా అరవడం, విజయం సాధించగానే కేరింతలు కొట్టడం వంటివి చేస్తూ ఆటలో పూర్తిగా నిమగమై తామే ప్రత్యక్షంగా పాల్గొన్ని విజయం సాధించిన అనుభూతికి లోనవుతుంటారు. టీన్స్‌లో ప్రధానంగా 14 నుంచి 18 ఏళ్ల వయస్సు మగపిల్లల్లో చోటుచేసుకునే హార్మోన్ల మార్పుల వల్ల వారు ఉద్రేకపూరితమైన భావనలకు లోనవుతారు. వారిని కోపగించు కోవడం లేదా ఆపాలని ప్రయత్నిస్తే వారు మరింత హద్దు మీరి ప్రవర్తించడం, పెడసరంగా తయారై చదువును విస్మరించడం లాంటివి చేయడం సహజం. రాత్రిపూట ఎక్కువసేపు మెలకువగా ఉండడం వల్ల హార్మోన్ల అసమతౌల్యంతో వాళ్లలో సెక్స్‌ కోరికలు విపరీతం కావడం వంటి పరిణామాలు చోటుచేసుకోవచ్చు. గేమింగ్‌ సెంటర్స్‌లో చెడు సావాసాలు కూడా ఏర్పడవచ్చు.
మరేం చేయాలి?
ముందుగా తల్లితండ్రులిద్దరూ పిల్లలతో ఎక్కువ సమయం గడపాలి. పిల్లలను కొట్టడం, తిట్టడం లేదా అవమానించడం చేయకూడదు. వారికి గేమింగ్‌ సెంటర్లలో ఉండే కంప్యూటర్లు లేదా వాటిని పోలిన కంప్యూటర్‌ను ఇంట్లో అమర్చండి. దీని వల్ల పిల్లలను ఇంటిపట్టునే ఉండేలా చేయవచ్చు. పిల్లల్ని ఆ వ్యసనం నుంచి దూరం చేయాలంటే గేమింగ్‌ సెంటర్స్‌ లాంటి చోట నుండి పిల్లలను ఇంటికి తేవడం అన్నది తొలి అడుగు. ఇంట్లో కంప్యూటర్‌ అమర్చడం ద్వారా దాన్ని సాధించవచ్చు. ఆ తర్వాత తన తోటి వయస్సు పిల్లలతో మీ పిల్లలు కలిసే వాతావరణాన్ని కల్పించండి. అయితే ఆ పిల్లలు ఇలాంటి వ్యసనాలు లేనివారై ఉండేలా చూసుకోవాలి. ఇది మీ బాధ్యతే. పిల్లలలో ఉన్న కంప్యూటర్‌ పరిజ్ఞానాన్ని మెచ్చుకోండి. ఆటలే కాకుండా ఇతరత్రా పనికొచ్చే విధంగా వారు ఇంకేదైనా చేయగలరేమో సున్నితంగా అడగండి. అంటే ప్రజెంటేషన్లు.. టైపింగు లాంటివి.
తప్పకుండా రాత్రి భోజనం ఇంట్లో అందరూ కలిసి చేసే విధంగా చూడండి.
పిల్లలను శారీరకంగా శ్రమ కలిగించే ఆటల్లో పాల్గొననివ్వకుడా ఎప్పుడూ 'చదువూ, చదువూ' అని తల్లితండ్రులు పోరు పెట్టకూడదు. అలాంటి పరిస్థితుల్లోనూ పిల్లలు ఈ తరహా గేమ్స్‌కు త్వరగా అలవాటు పడతారు. వీలైతే వారు శారీరక శ్రమ కలిగే ఆటల్లో పాల్గొనేలా చూడాలి.
వ్యాయామాలు, ఆటలలో పిల్లలను పాల్గొనమని ఉత్సాహపరచాలి.
ఈ కంప్యూటర్‌ గేమ్స్‌కు అలవాటు కావడం అంటే పెద్దల్లో ఆల్కహాల్‌, పొగతాగడం ఎలాగో పిల్లల్లో ఇదీ అలాంటి వ్యసనమేనని గుర్తుంచుకోవాలి. దీన్ని మాన్పించడానికి చాలా సమయం, చాలా ఓపిక కావాలి. నిపుణుల సలహా కూడా అవసరం కావచ్చు.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి