27, సెప్టెంబర్ 2013, శుక్రవారం

పోషక విలువలు - జాగ్రత్తలు

రకరకాల ఐరన్‌, క్యాల్షియం, మల్టీ విటమిన్‌ మాత్రలు, టానిక్‌లు వాడే బదులు మంచి ఆహారం తీసుకోవడం అవసరం. ఎందుకంటే రకరకాల ఆహార పదార్థాల్లోనే మన దేహానికీ, ఆరోగ్యానికీ అవసరమైన అన్ని రకాల పోషక విలువలూ లభిస్తాయి. ఆహార పదార్థాలను వండేటప్పుడు పోషక విలువలు పోకుండా జాగ్రత్తలు తీసుకోవడం మరీ ముఖ్యం.
విడిగా పాత్రలలో వండడం కంటే ప్రెషర్‌ కుక్కర్‌లో వండడం వల్ల పోషక విలువలు పరిరక్షించబడతాయి. విడిగా వండితే అవి ఆవిరి రూపంలో వెళ్లిపోతాయి. విడి పాత్రలలో వండితే మూతలు పెట్టి వండాలి.
ఆకుకూరలు, సొరకాయ, బీరకాయ, పొట్లకాయ, గుమ్మడికాయ, దోసకాయ వంటి సహజంగా నీరు ఉండే కూరగాయలను తక్కువ నీళ్లు పోసి వండాలి. వీటిలో సహజంగా ఉండే నీళ్లే ఇవి ఉడకడానికి సరిపోతాయి.
కూరగాయలను, ఆకుకూరలను ముందే శుభ్రంగా కడిగిన తర్వాత తరగాలి. తరిగిన తర్వాత కడిగితే వాటిలోని విటమిన్లు నీళ్లలో కలిసి వెళ్లిపోతాయి.
కూరగాయలు, ఆకుకూరలను మరీ చిన్న ముక్కలుగా గాక ఉడకడానికి అనువుగా వుండే వరకూ పెద్ద పెద్ద ముక్కలుగా కట్‌ చేసుకోవాలి. మరీ చిన్న ముక్కలు అయితే వాటి లోపల పోషక విలువలు తగ్గిపోతాయి.
కూరముక్కలు మరీ చితికిపోయే వరకు ఉడికించకూడదు. ఎక్కువ ఉడికే కొద్దీ విటమిన్లు చచ్చిపోతాయి. ముక్కలు తినడానికి అనువుగా వుండే వరకూ మాత్రం ఉడికిస్తే చాలు.
రెండు మూడు రకాల కూరగాయల కాంబినేషన్‌లో కూరలు చేసుకోనేప్పుడు ఎక్కువగా ఉడకాల్సిన వాటిని ముందుగా ఉడికించుకుని, తర్వాత త్వరగా ఉడికిపోయే వాటిని వేసుకోవాలి. అన్ని ఒకేసారి వేస్తే త్వరగా ఉడికిపోయే వాటిలో పోషకాలు తగ్గిపోతాయి.
వండిన పదార్థాను ఫ్రిజ్‌లో పెట్టుకుని, మళ్లీ వేడి చేసుకుని తినకూడదు. మళ్లీ మళ్లీ ఉడికించే కొద్దీ పోషక విలువలు తగ్గిపోతాయి. ఆహారం వండిన వెంటనే తినాలి.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి