26, సెప్టెంబర్ 2013, గురువారం

నడుము, మెడ నొప్పులకు సర్జరీ లేని చికిత్స


మన జీవనశైలి, ఆఫీసులో కూర్చునే విధానం, ఇళ్లల్లో మహిళలు పనిచేసే విధానంలో మార్పులు, పరిశ్రమల్లో కార్మికులు అస్తవ్యస్థమైన భంగిమల్లో బరువులెత్తడం, పనిచేయడంవల్ల నడుం, మెడ నొప్పులొస్తాయి. తొలిదశలోనే వీటిని గుర్తిస్తే జీవనశైలి మార్చుకోవడం వల్ల, వ్యాయామం చేయడం వల్ల నివారించే వీలుంది. సరైన నిర్ధారణ చేయకపోవడం, రోగి పరిస్థితులు, స్థితిగతులు, పనిచేసే విధానం, ఉపయోగించే వాహనాలు.. ఇలా అనేక అంశాలు పరిగణలోకి తీసుకోకుండానే నడుం, మెడనొప్పులకు శస్త్రచికిత్స చేస్తున్నారు. శస్త్రచికిత్స అవసరం లేకుండానే నడుం, మెడనొప్పులను తగ్గించే వీలుందని అంటున్నారు ప్రముఖ ఫిట్‌నెస్‌ నిపుణులు డాక్టర్‌ భక్తియార్‌చౌదరి. హైదరాబాద్‌ స్పైన్‌క్లినిక్‌ను నిర్వహిస్తున్న భక్తియార్‌చౌదరి 1200 మందిని సర్వే చేసి ఈ విషయాన్ని వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన నడుము, వెన్నునొప్పులు, నివారణ చర్యల గురించి తాను చేపట్టిన అధ్యయన విశేషాలను తెలిపారు. ఆ వివరాలు....
ఆపరేషన్‌ అవసరం లేకుండా నడుము, మెడ నొప్పులను నివారించే వీలుందా?
అవును. 95 శాతం కేసుల్లో ఆపరేషన్‌ నుంచి వెన్నెముకను కాపాడే వీలుంది.
మీరు నిర్వహించిన అధ్యయనంలో వెల్లడైన అంశాలు వివరిస్తారా?
ఈ అధ్యయనం అందరికళ్లను తెరిపిస్తోంది. సాధారణ నడుం, మెడనొప్పులకు ఆపరేషన్‌ చేసుకోకపోవడం వల్ల చచ్చుబడిపోవడం లేదనే విషయాన్ని ఇప్పటివరకు ప్రపంచంలో జరిగిన అధ్యయనాలు వెల్లడించలేదు. నడుము నొప్పి, మెడనొప్పు లకు చాలా అరుదుగా మాత్రమే సరైన రోగ నిర్ధారణ చేస్తున్నారు. ప్రతీ మెడనొప్పి స్పాండిలోసిస్‌ వల్ల రాదు. ప్రతీ నడుంనొప్పి డిస్క్‌ప్రోలాప్స్‌ వల్ల రాదు. వీటిలో 80 శాతం వరకు వృత్తిపరమైన ఒత్తిడివల్ల వస్తున్నాయి. గృహిణి బాధపడే నడుంనొప్పి నుంచి, గనుల్లో పనిచేసే కార్మికుడు బాధపడే తీవ్ర నడుం ఒత్తిడిని ఆపరేషన్‌ లేకుండా చికిత్స చేయొచ్చు. నివారించొచ్చు. ఇవీ వెన్నెమక వ్యాధికి సంబంధించిన కొన్ని అంశాలు. నడుము/మెడ నొప్పులకు సర్జరీ చేయాల్సిన అవసర ముందని వైద్యులు చెప్పాక చాలామంది రెండో అభిప్రాయం కోసం మా వద్దకు వస్తుంటారు. ఇలాంటి వారిలో 97 శాతం మంది 'సంప్రదాయ విధానం' వల్ల శస్త్రచికిత్స లేకుండానే విజయవంతంగా కోలుకున్నారు. కేవలం కొద్దిశాతం మందిలో సమస్య మళ్లీ తిరగబెట్టినా, తర్వాత కోలుకున్నారు. శస్త్రచికిత్స అవసరం లేకుండా మేం కొన్ని ప్రామాణికమైన పద్ధతులను అనుసరిస్తాం. అవి...
వివరణాత్మకమైన అంచనా.
వెన్నెముక కుదురుగా ఉంచే అంశాల పునఃస్సంధానం.
శరీర బరువు నిలకడగా ఉండేలా చూడడం.
కండరాలను దృఢపరిచే దిద్దుబాటు చర్యలు.
కండరాల అభ్యాసం.
ఎర్గొనామిక్స్‌ను అనుసరించడం. పనిచేసే ప్రదేశంలో లోపాలను సవరించుకోవడం.
నొప్పుల నిరోధక వ్యాయామం.
ఆర్థోటిక్స్‌, సపోర్ట్స్‌.
జాగ్రత్తగా ప్రణాళిక రూపొందించి, అంచనా వేసి, కౌన్సిలింగ్‌ చేయడంవల్ల పెద్ద సంఖ్యలో నడుం, మెడనొప్పులను నివారించే వీలుందని మేం గమనించాం.
మీరు చికిత్స చేసిన రెండు కేసులను ఉదహరిస్తారా?
ముందే చెప్పినట్లు నడుం, మెడనొప్పు లతో వచ్చిన రోగిని జాగ్రత్తగా పరిశీలించాలి. అతని గురించి పూర్తిగా తెలుసుకోవాలి. ఏం పని చేస్తారు? ఎన్ని గంటలు పనిచేస్తారు? అలవాట్లు ఏమిటి? తదితర విషయాలు తెలుసుకోవాలి.
కేస్‌ స్టడీ- 1 : పాలు పోసేందుకు ఒక వ్యక్తి స్కూటర్‌ను ఉపయోగిస్తున్నాడు. రెండువైపుల పాల క్యాన్లు తగిలించుకుని రోజూ పాలు పోసేవాడు. అయితే రెండువైపుల సమతుల్యత లోపించేది. ఒకవైపు బరువు ఎక్కువ, ఇంకోవైపు తక్కువ ఉండేది. దీంతో స్కూటర్‌ ఒకవైపుకు ఒరిగిపోయేది. దీన్ని సమం చేయడానికి ఇంకోవైపు కండరాలపై మరింత భారంపడేది. తన నడుంనొప్పి కోసం చాలామంది వైద్యులను సంప్రదించాడు. మందులు వాడాడు. డిస్క్‌జబ్బు, డిస్క్‌ప్రొలాప్స్‌ ఉందన్నారు. సర్జరీ చేయించు కోవాలని సలహా ఇచ్చారు. దీనికి సర్జరీ అవసరంలేదు. నా దగ్గరికొచ్చే వరకూ సుమారు లక్ష రూపాయలు ఖర్చు చేశారు. అన్ని విషయాలు తెలుసుకున్నాను. కేవలం అతని స్కూటర్‌ను పరిశీలించి, లోపాన్ని సరిచేశాను. దీంతో నడుంనొప్పి పూర్తిగా తగ్గింది.
కేస్‌ స్టడీ-2 : 23 ఏళ్ల సాఫ్ట్‌వేర్‌ ఇంజనీరు కొన్ని రోజు లుగా నడుంనొప్పితో బాధపడుతున్నాడు. తీవ్రమైన నొప్పి రావ డంతో డాక్టర్‌ను కలిశాడు. డాక్టర్‌ అతన్ని పరిశీలించకుండానే, అతని వృత్తి ఏమిటనేది తెలుసుకోకుండానే ఎంఆర్‌ఐ చేయించు కోవాలని సూచించారు. రిపోర్టు చూసి డిస్క్‌సర్జరీ చేయాలని అన్నారు. నా దగ్గరకు వచ్చినప్పుడు తన గురించి చెప్పాడు. తను పనిచేసే సంస్థలో సరైన భంగిమలో కూర్చోకపోవడంవల్ల, తల ముందుకు వాల్చడం వల్ల ఈ సమస్య వచ్చిందని గమనించాను. దీంతో ఇతను ఐటి పరిశ్రమలోని వారికి వచ్చే 'స్ట్రేయిట్‌ స్పైన్‌ సిండ్రోం' బారినపడ్దాడు. సర్జరీ అవసరం లేదని చెప్పాను. పనిచేసే ప్రదేశంలో కూర్చునే విధానంలో ఉన్న లోపాలను వివరించి, సరి చేశాను. నడుం నొప్పి తగ్గింది.
అసలు ఎర్గొనామిక్స్‌ అంటే ఏమిటి?
ఇది మనదేశ ఉత్పత్తికి ఒక కీలకమైన అంశం. ఎర్గొనామిక్స్‌లో రెండు పదాలున్నాయి. ఎర్గొ అంటే పని, నామిక్స్‌ అంటే ఎకానమి. ఇవి రెండు కలిపితే ఎర్గొనామిక్స్‌ అవుతుంది. అంటే సులభంగా, సౌకర్యంగా పనిచేయడాన్ని ఇది సూచిస్తుంది. ఎర్గొనామిక్స్‌ అపారమైన ఇంగితజ్ఞానమున్న పాత శాస్త్రం. కానీ ఇది చాలాదేశాల్లో పూర్తిగా నిర్లక్ష్యానికి గురైంది. ఇది మనిషి-యంత్రం సంబంధాన్ని సూచిస్తుంది. గడ్డం చేసుకోవడం, పెట్రోలియం బావులు తవ్వడం, ఎకె-47 తుపాకి మడమ, కంప్యూటర్‌తో పనిచేసే ప్రదేశాలు.... అన్నీంటికీ సురక్షితమైన ఎర్గొనామిక్స్‌ అవసరం. పనిచేసే ప్రదేశంలో సరైన విధంగాలేని ఎర్గొనామిక్స్‌వల్ల పెద్దసంఖ్యలో ఆరోగ్యసమస్యలు వృద్ధి చెందుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా చూస్తే మనదేశం ఈ సమస్యల్లో మొదటిస్థానాన్ని ఆక్రమించింది. గంటలపాటు నిల బడి, వివిధ భంగిమల్లో మెడ, చేతులను ఉపయోగించే టీచర్లు, లెక్చరర్లు వృత్తిపరమైన బాధాకర రుగ్మతల ప్రభావానికి గురయ్యే ప్రమాదముంది.
తప్పుడు ఎర్గొనామిక్స్‌ వల్ల మనిషి ఆరోగ్యంపై ఎలాంటి ప్రభావాలు కనిపిస్తాయి?
సరిగ్గాలేని ఎర్గొనామిక్స్‌ తప్పుడు భంగిమకు దారితీస్తుంది. ఇది మనిషి కండర-అస్తిపంజిర వ్యవస్థపై విపరీతమైన ఒత్తిడి కలిగిస్తుంది. ఫలితంగా కుములేటివ్‌ ట్రామ డిజార్డర్‌, ఎర్లీ డిస్క్‌-డిసీజ్‌, జాయింట్‌ స్ట్రెయిన్‌, ఎర్లీ స్పాండిలోసిస్‌, అధికరక్తపోటు వంటి వ్యాధులు వస్తాయి. తప్పుడు ఎర్గొనామిక్స్‌వల్ల కండరాలు నొప్పులు, నరాల నొప్పులు, వెన్నెముకలో వైకల్యం వంటివి సంభవిస్తాయి. 44 శాతం మంది భారతీయులు వృత్తిపరమైన ప్రమాదాల బారినపడుతున్నారు. ఇందులో 30 శాతం మందికి ఇళ్లల్లో, పనిచేసే ప్రదేశాల్లో అనుసరించాల్సిన సురక్షిత ఎర్గోనామిక్స్‌పై అవగాహన లేకపోవడం కారణం.
స్పాండిలోసిస్‌ అంటే ఏమిటి?
వయస్సుతోపాటు వెన్నుపూస మందంలో తగ్గుదల, చిన్న ఎముకల మధ్యస్థలం తగ్గడం, వెన్నుపూసల మధ్య ఉన్న కీళ్ల ఉపరితలంపై మృదుత్వాన్ని కోల్పోవడాన్ని స్పాండిలోసిస్‌ అంటారు. సాధారణంగా 60 ఏళ్ల తర్వాత ఇది కనిపిస్తుంది. చాలా వృత్తుల్లో వెన్నెముకను దుర్వినియోగం చేయడం, మితిమీరివాడటం వల్లా కొన్నిసార్లు స్పాండిలోసిస్‌ వస్తుంది.
వెన్నుపూసకు వచ్చే ఇతర జబ్బులేమిటి?
ఇన్‌ఫెక్షన్‌ (క్షయ), ఆటో-ఇమ్యూన్‌డిసీజ్‌, ట్రాఫిక్‌ ప్రమాదాలు, కిందపడటం, క్యాన్సర్‌ కణతి వల్ల కూడా స్పాండిలైటిస్‌ వస్తుంది. ఇలాంటప్పుడు ప్రత్యేక శ్రద్ధ అవసరం.
నడుం, మెడనొప్పులకు ఎప్పటికీ సర్జరీ అవసరం లేదా?
ముందే చెప్పినట్లు 95 శాతం కేసుల్లో సర్జరీ అవసరం లేదు. కేవలం ఐదు శాతం కేసుల్లోనే సర్జరీ అవసరం. కొన్ని ముఖ్యమైన ప్రమాదకర చిహ్నాలు సర్జరీ చేయించుకోవాలని సూచిస్తాయి. అవి...
అన్ని క్యాన్సర్‌ కణితులు
తీవ్రమైన ఫ్రాక్చర్లు
శరీర నిర్మాణ అసాధారణ స్థితి.
చికిత్సకు స్పందించని పురోగమన క్షీణత
మూత్రనాళ ప్రమేయం, ఫూట్‌-డ్రాప్‌.
విశ్రాంతి తీసుకున్నా, చికిత్స చేయించుకున్నా భరించలేని నొప్పి ఉంటే.
పరిస్థితి మరింత దిగజారినా, మూడునెలలపాటు 'కన్సర్వేటివ్‌ మేనేజ్‌మెంట్‌' విధానం పాటించినా ఫెయిలైన ప్పుడు శస్త్రచికిత్స అవసరం.
వెన్నుముకలోని డిస్క్‌తో సంబంధం ఉన్నా, లేకపోయినా నడుం, మెడనొప్పులను శస్త్రచికిత్స అవసరం లేకుండానే విజయ వంతంగా చికిత్స చేయవచ్చు.
నడుము, మెడనొప్పుల నివారణకు మీరిచ్చే సలహాలు ?
మన జీవనశైలిని మార్చుకోవడం వల్ల వీటిని చాలావరకు తగ్గించునే వీలుంది. దీనికి చేయాల్సింది....
బరువైన వస్తువులను ఎత్తేటప్పుడు సరైన భంగిమ లోఎత్తాలి.
పడుకునే పరుపులు, తల కింద పెట్టుకొనే దిండ్లు / మెత్తల ఎంపికలో జాగ్రత్తగా ఉండాలి.
పనిచేసే ప్రదేశంలో ఎర్గొనామిక్స్‌ పద్ధతులను పాటించాలి.
శరీరాకృతికి సరిపడే ద్విచక్ర వాహనం లేదా కారును ఉపయోగించాలి.
క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం వెన్నెముకకు చాలా కీలకం.
రోజువారీ పనుల్లో కాళ్లను ఉపయోగించండి.
బరువులో 25 శాతం కంటే ఎక్కువ బరువుండే వస్తువు లను ఎత్తడాన్ని నిలువరించాలి.
వయస్సు, ఎత్తుకు తగ్గ బరువు ఉండాలి. మంచిపోషక విలువలున్న ఆహారం తీసుకోవాలి.
నొప్పి రాగానే శస్త్రచికిత్స నిపుణుల్ని కాకుండా ఫిజీషియన్‌ను సంప్రదించండి.
బరువు తగ్గుతుంటే మీ అంతట మీరే పరిశీలించండి.
తొలిసారి నొప్పు లకు సంబంధించి జబ్బు ల నిర్ధారణకు సిటిస్కాన్‌, ఎక్స్‌రేలు, ఎంఆర్‌ఐలు అవసరం లేదు.
నివారణ వ్యాయామ కార్యక్రమం చాలా ముఖ్యం
పోషకాహారలోపం, విటమిన్‌ లోపం, హార్మోన్ల అసమతుల్యతను సరి చేసుకోవాలి. 

భక్తియార్‌చౌదరి
ఫిట్‌నెస్‌ నిపుణులు
హైదరాబాద్‌.  

9849136940

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి